నిబంధనల ప్రకారమే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక
ఓపెన్ టెండర్ విధానం ద్వారా 47 ఏజెన్సీల ఎంపిక
జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ద్వారా తుది కేటాయింపులు
వాట్సాప్‌లో వచ్చిన వార్తలపై వరంగల్ కలెక్టర్ కార్యాలయం వివరణ
‘అహాన్’ ఏజెన్సీపై ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదని స్పష్టీకరణ
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక మరియు విభాగాల కేటాయింపు ప్రక్రియ అంతా ప్రభుత్వ నిబంధనలకు లోబడి, పూర్తిగా పారదర్శకంగా జరిగిందని వరంగల్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఔట్‌సోర్సింగ్ కమిటీ స్పష్టం చేసింది. ఇటీవల వాట్సాప్ వేదికగా అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపికపై వచ్చిన ప్రతికూల కథనాల్లో వాస్తవం లేదని, టెండర్ల ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే సాగిందని అధికారులు తేల్చిచెప్పారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారిక వివరణ విడుదల చేశారు. ఆర్థిక సంవత్సరం 2025-26 కు గాను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక కోసం 23.07.2025న ఓపెన్ టెండర్ ప్రకటన జారీ చేయడం జరిగిందని అధికారులు వివరించారు. ఈ టెండర్ ప్రక్రియలో మొత్తం 63 ఏజెన్సీలు పాల్గొనగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత సాధించిన 47 ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లా ఔట్‌సోర్సింగ్ కమిటీ ఎంపానెల్ చేసింది. ఈ ఎంపిక ప్రక్రియ 01.09.2025 నుండి అమలులోకి వచ్చిందని, కొత్త కమిటీ లేదా కొత్త ఎంపానెల్‌మెంట్ వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
‘అహాన్’ ఏజెన్సీపై అభ్యంతరాలు లేవు
జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు ఈ ఏజెన్సీలను కేటాయించేటప్పుడు సదరు శాఖలు సమర్పించిన అభ్యర్థనలు, ప్రాధాన్యాల (ఆప్షన్స్) ఆధారంగానే తుది కేటాయింపులు జరిగాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేటాయింపులన్నింటికీ జిల్లా కలెక్టర్ తుది ఆమోదం తెలిపారని వెల్లడించారు. ముఖ్యంగా వివాదాస్పదంగా మారిన “అహాన్” అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ విషయమై నిబంధనల ప్రకారమే ఎంపిక జరిగిందని, ఆ ఏజెన్సీపై ఇప్పటివరకు ఎవరి నుంచి ఎలాంటి లిఖితపూర్వక అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు రాలేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ అంతా సాగిందని వివరించారు.

