ఉద్యమ స్పూర్తిని చెరిపేసే కుట్ర
తెలంగాణ భావజాలంపై ప్రభుత్వం దాడి
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి
టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత
కాకతీయ, కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి గౌరవిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నరేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉద్యమకారుల సమస్యలపై పోరాటం చేస్తుంటే ప్రభుత్వం కమిటీలు వేసి కాలయాపన చేస్తోందని, అమరుల కుటుంబాలకు అండగా నిలవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. జార్ఖండ్ తరహాలో తెలంగాణ ఉద్యమకారులకు రాయితీలు, రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ భావజాలంపై దాడి చేస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయుల ఆనవాళ్లను తొలగించడం, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం, బతుకమ్మకు ప్రాధాన్యత తగ్గించడం వంటివి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలని విమర్శించారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, ఉద్యమ కాలం నాటి చారిత్రక గుర్తులను తొలగించడం ఉద్యమ స్ఫూర్తిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలో కళాకారులకు ప్రాధాన్యత పెంచాలని, గద్దర్ పేరుతో అవార్డుల కంటే జానపద అకాడమీ ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు.
పవన్ కళ్యాణ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాదంతో పోల్చడం ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని, అటువంటి వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలపై ఉద్యమ శక్తులు మరింత సంఘటితం కావాలని, భవిష్యత్ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

