భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల వేడుకలు
కాకతీయ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ బోనాల వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకోగా, యువకులు కేరింతలు కొడుతూ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.శివశక్తుల పూనకాల నడుమ గ్రామదేవత పోచమ్మ ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం తమ మొక్కులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల వేడుకల్లో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.

