ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి
విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్
కాకతీయ, జగిత్యాల : ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని, వీటిని అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్ విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యా వ్యవస్థలో లోపాలు
రాష్ట్రంలో మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర నష్టానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఇన్చార్జి డీఈవోలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నా అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్రలను మానుకోవాలని, హాస్టళ్లకు పక్కా భవనాలను నిర్మించాలని కోరారు. జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని వెంటనే అమలు చేయాలని, అనుమతులు లేని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్, నగర కార్యదర్శి రాపాక నిఖిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు, మారుతి, కార్యకర్తలు ప్రణీత్, అజయ్, అభిషేక్ పాల్గొన్నారు.

