భూపాలపల్లిలో సీసీఎఫ్ భవనం ప్రారంభం
వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ పాత్ర కీలకం : ఎమ్మెల్యే గండ్ర
కాకతీయ, హైదరాబాద్ / భూపాలపల్లి : హైదరాబాద్‌లోని గుర్రం గూడలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీసీఎఫ్ (ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన అనంతరం, జిల్లా కేంద్రంలోని నూతన కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సీసీఎఫ్ ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ పాత్ర ఎంతో కీలకమైనదని, జిల్లాలో సీసీఎఫ్ నూతన భవనం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, వన మహోత్సవ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సీసీఎఫ్ భవనం జిల్లా అటవీ సంపద రక్షణకు మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ మరియు ఇతర అధికారులు కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటర్ ప్రభాకర్, డీఎఫ్ఓ నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, అటవీ శాఖ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

