అన్నదాతకు అన్యాయం చేస్తే సహించం
కోటాల పేరుతో ధాన్యం కొనుగోళ్లలో కోత
రైతు సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపు
కాకతీయ, కరీంనగర్: తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలోకి నెట్టేశాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. శనివారం గంగాధర మండలం మధురనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా పరస్పరం నెపం నెట్టుకుంటూ అన్నదాతలను దిక్కులేని పరిస్థితికి గురిచేస్తున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలు కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు.
రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కోటా పేరుతో ప్రభుత్వం చేతులెత్తేయడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని, రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందని సుంకె రవిశంకర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు భీమా, కాళేశ్వరం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలతో వ్యవసాయ రంగం బలోపేతమైందని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతుబంధు సక్రమంగా అమలు కాకపోవడం, రైతు భీమా నిలిచిపోవడం, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చోటుచేసుకోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

