త్వరలోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
నిర్మాణ పనులు పూర్తి : రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్
మల్లన్న స్వామిని దర్శించుకున్న అనంతరం పనుల పరిశీలన
కాకతీయ, కొమురవెల్లి: కొమురవెల్లి రైల్వే స్టేషన్ను బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ శనివారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించి పరిశీలించారు. స్టేషన్లో చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే రైల్వే స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రారంభోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పనులపై సమీక్ష నిర్వహించి, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కావడంతో శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు మెరుగైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సౌడ రమేష్, రాష్ట్ర నాయకుడు బూరుగు సురేష్ గౌడ్, తోకల ఉమారాణి, ధడ్యాల లక్ష్మారెడ్డి, కాశెట్టి పాండు, బీజేపీ కొమురవెల్లి మహిళా మండల అధ్యక్షురాలు బూర్గజు స్వరూప, ఎక్కాలదేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

