ఓం’కు బదులుగా ‘జాం’
ప్రజాప్రతినిధుల సమక్షంలోనే అక్షర దోషం
ఉపాధ్యాయురాలి పొరపాటుపై తల్లిదండ్రుల ఆగ్రహం
కాకతీయ, చేర్యాల: వీరన్నపేట ప్రాథమిక పాఠశాలలో సోమవారం జరిగిన అక్షరాభ్యాసం కార్యక్రమంలో అక్షర దోషం చోటుచేసుకుంది. గ్రామ ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థి పలకపై ‘ఓం’ అని రాయించాల్సిన చోట, సంబంధిత ఉపాధ్యాయురాలు ‘జాం’ అని రాయడం చర్చనీయాంశమైంది. అక్షరాభ్యాసం వంటి పవిత్రమైన కార్యక్రమంలో బాధ్యతారహితంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఈ తప్పు జరగడం బోధన నాణ్యతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థుల విద్యా జీవితంలో తొలి అడుగులోనే ఇలాంటి పొరపాట్లు జరగడం విచారకరమని స్థానికులు పేర్కొంటున్నారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను మెరుగుపరిచేలా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.

