అరుంధతి కళ్యాణ మండపం ప్రారంభమెప్పుడు..?
నిర్మాణం పూర్తయి నాలుగేళ్లయినా వీడని సందిగ్ధం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసమని చెప్పి ఇప్పుడు పట్టించుకోరా?
అధికారుల మధ్య సమన్వయ లోపమా? ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా?
కాకతీయ, శంకరపట్నం : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెనుక 500 సర్వే నంబర్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా నిర్మించిన ‘అరుంధతి కళ్యాణ మండపం’ నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భూమిపూజ చేసి శంకుస్థాపన చేసిన ఈ భవనం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సామాజిక కార్యక్రమాలు, వివాహాలు, సమావేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అప్పట్లో ఘనంగా ప్రకటించారు. తీరా కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం పూర్తి చేసినా, దాన్ని ప్రజలకు అప్పగించడంలో పాలకులు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రారంభంలో జాప్యానికి కారణాలేంటి?
నిర్మాణ పనులు వంద శాతం పూర్తయినా ఇప్పటికీ మండపం తాళాలు తీయకపోవడం వెనుక అసలు కారణాలేంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందా? లేక ఇంకా ఏవైనా పరిపాలనా అనుమతుల సమస్యలు వేధిస్తున్నాయా? లేక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి వర్గాల వారు శుభకార్యాలు జరుపుకోవడానికి వీలుగా నిర్మించిన ఈ భవనం వృథాగా దర్శనమిస్తుండటంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆలస్యానికి గల కారణాలను వెల్లడించాలని, అరుంధతి కళ్యాణ మండపాన్ని తక్షణమే ప్రారంభించి నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

