అజంజాహి మిల్లు భూముల వేలాన్ని అడ్డుకుంటాం!
సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కుతున్న ప్రభుత్వం
కార్మికులకు ఇవ్వాల్సిన స్థలాలను వేలం వేయడం దారుణం
జూన్ 26న వేలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటానికి ‘వర్కర్స్ యూనియన్’ పిలుపు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగర చరిత్రతో ముడిపడి ఉన్న చారిత్రాత్మక అజంజాహిమిల్లు భూముల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమని, ప్రాణాలొడ్డైనా అడ్డుకుంటామని మాడిఫైడ్ వాలంటరీ రిటైర్మెంట్ 2002 వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. బుధవారం వరంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. జూన్ 26న (శుక్రవారం) అజంజాహిమిల్లుకు చెందిన విలువైన భూములను వేలం వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు కొమ్ము సందీప్, ప్రధాన కార్యదర్శి బస్కుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
గతంలో మిల్లు మూసివేత సమయం నుంచి కార్మికులు సుదీర్ఘ న్యాయపోరాటం చేశారని, ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిస్తూ.. నష్టపోయిన 318 మంది కార్మికులకు సదరు మిల్లు స్థలంలోనే భూములు కేటాయించాలని ఆదేశించిందని వారు గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం.. దాన్ని పూర్తిగా పక్కనబెట్టి, కార్మికులకు చెందాల్సిన భూములను వేలం ద్వారా అమ్ముకోవడానికి సిద్ధపడటం కార్మిక ద్రోహమేనని మండిపడ్డారు. భూముల వేలాన్ని నిరసిస్తూ గత వారం రోజులుగా కార్మికులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నా పాలకులు, జిల్లా అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.
అన్ని వర్గాలు కలిసి రావాలి
ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి జూన్ 26న నిర్వహించతలపెట్టిన భూముల వేలం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటంలో వరంగల్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, రాజకీయ శ్రేణులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్మీట్లో ఐఎఫ్టీయూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, జనగం కుమారస్వామి, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాయకుడు కంపెళ్లి ప్రవీణ్, ఏపీసీఎల్సీ జిల్లా నాయకులు దాసు, గద్దల సంజీవ, కుచన సమ్మయ్య, శ్యామ్, యశోద తదితరులు పాల్గొన్నారు.

