ఇంటింటి సర్వే పారదర్శకంగా చేపట్టాలి
రెండు చోట్ల ఓటు ఉంటే ఒకే చోటుకు పరిమితం చేయాలి
అర్హుల నమోదు, అనర్హుల తొలగింపుపై ప్రత్యేక దృష్టి
ఎస్ఐఆర్‌పై గీసుగొండ తహసీల్దార్ ఆదేశం
నిర్దేశిత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచన
కాకతీయ, గీసుగొండ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ అధికారులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రక్రియను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. జూన్ 30 నుంచి జూలై 29 వరకు బీఎల్‌ఓలు ఇంటింటి సర్వేను పూర్తి చేయాలని తహసీల్దార్ సూచించారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను నిబంధనల ప్రకారం ఓటరు జాబితా నుంచి తొలగించాలని, అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయాలని ఆదేశించారు. రెండు వేర్వేరు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారిని గుర్తించి, ఒకే చోట మాత్రమే ఓటు ఉండేలా చూడాలని, ఇందుకోసం వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కొత్తగా నమోదు చేసుకునే వారు నివాస ధ్రువీకరణతో పాటు పదో తరగతి సర్టిఫికెట్, పాస్‌పోర్టు, జనన ధ్రువీకరణ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి సమర్పించాలని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉందని, సందేహాల నివృత్తికి 1950 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. వివాహిత మహిళలు తమ పుట్టింటి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి, మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ అధికారి ఉదయశ్రీ, ఆర్‌ఐలు సాంబయ్య, మధుచంద్ర, టీఓటీలు రాంబాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

