‘అప్పులపై నిజాలు చెబితే బీఆర్ఎస్‌కు అక్కసు’
రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీశారు
కాళేశ్వరం పేరుతో రూ.1.20 లక్షల కోట్లు వృథా
బీజేపీ–బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ.. రాష్ట్రంలో నాటకం
విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
కాకతీయ, కరీంనగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాము వాస్తవాలు చెబుతున్నందుకే కేటీఆర్, హరీశ్‌రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్లు, సొసైటీల పేరుతో ముందుచూపు లేకుండా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు జరిగాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం పేరుతో గోదావరి పాలు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ నాయకులు వృథా చేశారని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. నేరెళ్ల బాధితులపై అరాచకాలు, సిరిసిల్లలో ఇసుక మాఫియా అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్‌కు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 3,000 ఇందిరమ్మ ఇళ్లు, 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 2 లక్షల రైతు రుణమాఫీని ఏకకాలంలో అమలు చేశామని వివరించారు. దేశంలో బీజేపీ 11 ఏళ్ల పాలనలో సామాన్యుడికి చేసిందేమీ లేదని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి ఉద్యోగాలు కోల్పోయేలా చేశారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో లోపాయికారీ ఒప్పందం ఉందని, రాష్ట్రంలో మాత్రం పరస్పర ప్రత్యర్థులుగా నటిస్తున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ పట్ల ప్రజలకున్న ఆదరణకు నిదర్శనమని, రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

