ఎల్ఎండీలో చేపల వేట నిషేధం
జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
మత్స్య సంపద పెంపునకు ప్రభుత్వం చర్యలు
కాకతీయ, కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) జలాశయంలో చేపలు, రొయ్యల వేటపై జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు పూర్తిస్థాయి నిషేధం విధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఈ రెండు నెలల పాటు వేటను నిలిపివేయడం ద్వారా జలాశయంలో మత్స్య సంపద గణనీయంగా పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మత్స్యకారులకు మెరుగైన దిగుబడి లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని వివరించారు. నిషేధ కాలంలో లైసెన్స్‌దారులు, మత్స్యకార సహకార సంఘాల సభ్యులు ఎవరూ కూడా నిబంధనలను ఉల్లంఘించి వేటలో పాల్గొనరాదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ స్పష్టం చేసింది.

