చిరుతిళ్లలో చీకటి వ్యాపారం
బయటపడుతున్న కల్తీ బండారం
కరీంనగర్‌లో వరుసగా వెలుగులోకి ఆహార కల్తీ
చిన్నారుల ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం
తయారీ వివరాలు లేని నాసిరకం స్నాక్స్
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లో రోజుకో కల్తీ వ్యవహారం వెలుగులోకి వస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల పశువుల దాణాతో మిల్‌మేకర్ తయారు చేస్తున్న వ్యవహారం బయటపడగా, తాజాగా చిన్నారులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న నాణ్యతలేని చిరుతిళ్ల దందా బట్టబయలైంది. జిల్లాలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఆహార భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గంజ్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ‘హ్యాపీ బర్త్ డే’ పేరుతో విక్రయిస్తున్న కుర్కురే తరహా స్నాక్స్, చిన్న ప్లాస్టిక్ లిక్విడ్ ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఉత్పత్తులపై తయారీ సంస్థ పేరు, పూర్తి చిరునామా, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ నంబర్ వంటి కనీస వివరాలు కూడా లేవని ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి వెల్లడించారు.
పిల్లల ఆరోగ్యంతో చెలగాటం
తక్కువ ధరలకు రంగురంగుల ప్యాకెట్లలో లభిస్తున్న ఈ నాసిరకం ఉత్పత్తులు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వరుసగా బయటపడుతున్న కల్తీ దందాల నేపథ్యంలో, ఇకపై విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారులు కూడా ఏదైనా వస్తువు కొనే ముందు తయారీ వివరాలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ నంబర్, గడువు తేదీలను కచ్చితంగా పరిశీలించాలని సూచించారు.

