స్కూల్ భూమి ఆక్రమణకు యత్నం
అడ్డుకున్న మణుగూరు రెవెన్యూ అధికారులు
కాకతీయ, మణుగూరు: ఉడతాని నగర్‌లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన విలువైన స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించగా, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే తహసీల్దార్ అద్దంకి నరేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గోపి సంఘటనా స్థలానికి చేరుకొని, ఆక్రమణదారులను అక్కడి నుంచి పంపించి వేసి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఎవరైనా ఆక్రమించేందుకు యత్నిస్తే సహించేది లేదని, అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అద్దంకి నరేష్ ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కాపాడటమే తమ ప్రధాన బాధ్యత అని పేర్కొన్న అధికారులు, ప్రజలు కూడా ఇటువంటి అక్రమాలపై వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

