మీకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే
ప్రజా సేవతోనే ఈ గడ్డ రుణాన్ని తీర్చుకుంటా
ఇదే ప్రజల ఆశీస్సులతో నా ప్రస్థానం మొదలైంది
సామాజిక న్యాయం.. నా పాలన లక్ష్యం
నేను పుట్టింది ఈ మట్టిలోనే.. అందుకే పేదవాడి కష్టం తెలుసు
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్
మిడ్జిల్ గడ్డపై కన్నీటి పర్యంతమైన ముఖ్యమంత్రి
పదే పదే పాలమూరు జిల్లా ప్రజానీకాన్ని తలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : “రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం అధికారం చేపట్టడం కాదు.. నా గడ్డకు, నన్ను నమ్మిన ప్రజలకు సేవ చేయడం. 20 ఏళ్ల క్రితం ఇదే మట్టిలో, ఇదే ప్రజల ఆశీస్సులతో నా ప్రస్థానం మొదలైంది. జెడ్పీటీసీగా నన్ను గెలిపించి రాజకీయాలకు పరిచయం చేసిన ఈ ప్రజల రుణం తీర్చుకునే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. నా ప్రాణం ఇచ్చినా ఆ రుణం తీరదు!”.. అంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగంతో చేసిన ప్రసంగం సభికులను కట్టిపడేసింది. ఆయన గొంతులో పలికిన కృతజ్ఞత, కళ్ళలో కనిపించిన నిబద్ధత.. మిడ్జిల్ ప్రజల గుండెలను తాకాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా, ఆ మూలాలను, ఆ కష్టాలను రేవంత్ ఏమాత్రం మర్చిపోలేదు. పల్లెటూరిలో పుట్టి, దుక్కి దున్ని, విత్తనం నాటి పెరిగిన వ్యక్తిగా, భూమితో మనిషికి ఉండే బంధం ఏమిటో తనకు తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. “గ్రామాల్లోని సమస్యలు, పేదవాడి బాధలు చూస్తూ పెరిగిన వాడిని నేను. నాకు పరిపాలన అంటే ఫైళ్లు కాదు.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం” అని ఆయన స్పష్టం చేశారు. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు ఎత్తి ప్రశ్నించి, అధికారంలోకి వచ్చాక పరిష్కార మార్గాలను అన్వేషించానని చెప్పారు.

‘డార్క్ ఏరియా’ నుంచి ‘గోల్డెన్ మిడ్జిల్’గా..
ఒకప్పుడు మిడ్జిల్ మండలం అంటేనే వెనుకబాటుతనం, డార్క్ ఏరియా అన్న ముద్ర ఉండేది. రోడ్లు లేవు, సాగు నీరు లేదు.. కనీస వసతులకు నోచుకోని ఆ రోజులను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి, నాటి దుస్థితిని తలచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ కటిక చీకటి రోజుల్లోనే ప్రజలు నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకమే ఈరోజు నన్ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేసింది. ఇప్పుడు ఆ డార్క్ ఏరియా ముద్రను చెరిపేసి, మిడ్జిల్‌ను రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన మండలాల్లో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యత నాది” అని ప్రకటించారు. ఈ మండలాన్ని ప్రత్యేకంగా దత్తత తీసుకుని, అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆదేశించారు.

సామాజిక న్యాయం.. నా పాలన లక్ష్యం
సమస్యల చిట్టా విప్పడం, కాలక్షేపం చేయడం తన నైజం కాదని రేవంత్ గట్టిగా చెప్పారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ ఉప కులాల వర్గీకరణను పరిష్కరించడం, వందేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న బీసీ కులగణనను చేపట్టడం తన ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. “కేవలం లెక్కలు చెప్పడమే కాదు, ఆయా వర్గాలకు వారి వాటా, వారి హక్కులను దక్కించడమే నిజమైన సామాజిక న్యాయం” అని ఆయన వివరించారు. ఈ గడ్డపై జన్మించిన దిగ్గజ నేతలను సీఎం స్మరించుకున్నారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి, ద్యాప గోపాల్ రెడ్డి, మహేంద్రనాథ్ వంటి మహనీయుల బాటలోనే పయనిస్తున్నానని ఆయన చెప్పారు. వారి ఆశయాలను నిజం చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే తన ధ్యేయమని అన్నారు.
“గ్రామ స్వరాజ్యమే గమ్యం”
రాష్ట్రమంటే ఎక్కడో లేదని, 12 వేల గ్రామ పంచాయతీల సమాహారమే తెలంగాణ అని ఆయన వివరించారు. గ్రామం బాగుపడితేనే మండలం, జిల్లా, దేశం అభివృద్ధి చెందుతాయని, ఆ దిశగా తన అడుగులు పడుతున్నాయని చెప్పారు. చివరగా, తన గెలుపు తనది కాదని, అది మిడ్జిల్ మండల ప్రజల విజయమని వినమ్రంగా చెప్పారు. వలసల పాలమూరును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం తన ప్రాథమిక బాధ్యత అని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమం మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఒక నూతన ఉత్తేజాన్ని నింపింది. సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం విన్న ప్రజలు, ఒక నాయకుడు తన మూలాలను ఎలా గౌరవిస్తాడో అన్నదానికి ఆయన ప్రత్యక్ష నిదర్శనమని చర్చించుకున్నారు.

