ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో జాప్యం
కేశవరావు కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్
ఆగస్టు నుంచి ‘ఉద్యమకారుల ఓదార్పు యాత్ర’కు పిలుపు
ఉద్యమకారుల సంక్షేమానికి కోసం ఐక్య వేదిక ఐదు డిమాండ్లు
కాకతీయ, హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాల పాటు వేలాది మంది ఉద్యమకారులు పోరాడారని, ఎంతోమంది అమరులయ్యారని, మరికొందరు జైలు పాలయ్యారని, సర్వస్వాన్ని కోల్పోయారని, అలాంటి త్యాగధనులను గుర్తించి గౌరవించాల్సింది పోయి నేడు పాలకులు వారిని నిర్లక్ష్యం చేయడం చాలా నీచమైన చర్య అని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ ధ్వజమెత్తారు. హనుమకొండలోని కాకతీయ కాలనీలో జరిగిన ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారుల శ్రమతోనే ఏర్పడిందని రవికుమార్ గుర్తు చేస్తూ, ఉద్యమకారుల శ్రమతో ఏర్పడిన ప్రభుత్వం వారిని ఆదరించకపోవడం దురదృష్టకరమని, మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 240 గజాల స్థలం, 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచినా అమలు చేయకపోవడం మోసపూరిత వైఖరి అని ఆయన మండిపడ్డారు. ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే గతంలో 30 ఏళ్లు కొనసాగాల్సిన పాలనను ఒక ప్రభుత్వం 9 ఏళ్లలోనే కోల్పోయిందని ఆయన హెచ్చరించారు.
హామీల అమలులో జాప్యంపై హెచ్చరిక
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేషవరావు కమిటీని స్వాగతిస్తున్నామని చెబుతూనే, ఆ పేరుతో కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని రవికుమార్ స్పష్టం చేశారు. కమిటీల పేరుతో సమయం వృథా చేస్తే 5 ఏళ్లు కూడా అధికారంలో ఉండలేరని ఆయన హెచ్చరించారు. ఉద్యమంలో సర్వస్వాన్ని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ఉద్యమకారులను ఆదుకోవడానికి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆగస్టు నెల నుండి ‘ఉద్యమకారుల ఓదార్పు యాత్ర’ చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఐక్య వేదిక ప్రధాన డిమాండ్లు
ఈ సమావేశంలో ఐక్య వేదిక ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం కేటాయించాలని, రూ.10 లక్షల ఆర్థిక ఉద్దీపన అందించాలని, నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో సంక్షేమ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించింది. ఈ సమావేశంలో తొలి దశలో పోరాడిన 10 మంది ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సందేశ సునీల్, యండి. చాంద్ పాషా, బోళికెట్టి అశోక్, అనుమల రమేష్, చెన్నూరి నటరాజ్, మనోహర్ రావు, మొగసాల దేవేందర్ రెడ్డి, మీర్జా అంజద్, రామ్ కుమార్, మెలుంగారి నెల్సన్ గోపన్న, బోయిన రాజు, బరిగాల కృష్ణ మూర్తి, ఇమాడిశెట్టి రాజు, ఖదీర్, స్వర్ణ, పద్మ తదితరులు పాల్గొన్నారు.


