లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా మారుస్తున్నాం
నిమ్జ్‌ను మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం
రాష్ట్ర పారిశ్రామిక పురోగతిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి
పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా పరిశ్రమలను ప్రోత్సాహం
కొత్త ఔషధ ఆవిష్కరణలకు ప్రభుత్వం పూర్తి సహకారం
ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కాకతీయ, సిద్దిపేట : ఆరోగ్య రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను అవకాశాలుగా అందిపుచ్చుకుని తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పరిశోధన సాంకేతికత కృత్రిమ మేధ మరియు అధునాతన తయారీ నైపుణ్యాభివృద్ధిని సమన్వయం చేస్తూ భవిష్యత్తులో హెల్త్ కేర్ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కరకపట్లలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 3 లో 800 కోట్ల రూపాయల పెట్టుబడితో సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

పారిశ్రామిక రంగంలో తెలంగాణ ముందంజ
పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జహీరాబాద్ నిమ్జ్ ను మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్ ఫార్మా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ హిత పద్ధతుల్లో ఔషధాలను ఉత్పత్తి చేసేలా పరిశ్రమలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చేలా తెలంగాణ నుంచే ఒక కొత్త మాలిక్యూల్ ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిస్తూ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ 2047 మరియు నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా పరిశోధన నుంచి ఉత్పత్తి వరకు అన్ని దశలను అనుసంధానించేలా ఒక ప్రత్యేక వ్యవస్థను నిర్మిస్తున్నామని ఇందులో భాగంగా బయోలాజిక్స్ బయోసిమిలర్స్ సెల్ మరియు జీన్ థెరపీలు కృత్రిమ మేధ మరియు డిజిటల్ హెల్త్ తదితర అత్యాధునిక రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారం అసంబద్ధం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ మరియు హిల్ట్ పాలసీలపై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రెండున్నరేళ్లలో పారిశ్రామికంగా రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేకే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు అదే పనిగా బురద చల్లుతున్నాయని ఆయన విమర్శించారు. తాజాగా ప్రారంభించిన ఈ ప్లాంట్ లో అత్యాధునిక కంటైన్‌మెంట్ టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ నివారణకు సంబంధించిన ఓరల్ ఆంకాలజీ ఔషధాలు స్టెరిలైజ్డ్ ఇంజెక్టబుల్స్ లైయోఫిలైజ్డ్ పౌడర్ ఇంజెక్షన్లు మరియు సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ ను ఉత్పత్తి చేస్తారని ఆయన వివరించారు. ఇక్కడ కొత్తగా 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ ఫార్మా రంగ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ ప్రతినిధులు డాక్టర్ గోవింద రెడ్డి మరియు డాక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

