తండాల్లో ‘సీత్ల’ సంబరం
ప్రకృతిని ఆరాధించే విశిష్ట జీవనశైలి
గిరిజనుల పశుసంపదకు రక్షణే పరమావధిగా పూజలు
‘దాటుడు పండుగ’గా ఖ్యాతిగాంచిన సీత్ల మహోత్సవం
వేములవాడ గిరిజన తండాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ
కాకతీయ, వేములవాడ : అడవి గాలిలో పులకింత మొదలైంది. ఆషాఢం రాకతో వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, రుద్రంగి, కొనరావుపేట, విర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని గిరిజన తండాలు ఆధ్యాత్మిక శోభతో తడిసిముద్దవుతున్నాయి. తరతరాలుగా తమ మూలాలను, ఆచారాలను ఏమాత్రం విస్మరించని గిరిజనులు, ప్రకృతినే పరమదైవంగా భావించి ‘సీత్ల’ సంబరానికి అడుగులు వేస్తున్నారు. వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, మూగజీవాలు వ్యాధుల బారిన పడకుండా ఉండాలని వారు జరిపే ఈ వేడుక, గిరిజన జీవనంలోని సత్యనిష్టకు, ప్రకృతి ఆరాధనకు నిలువుటద్దం.


ఏడుగురు దేవతల ఆరాధన..
గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ కాలం నాటి సంప్రదాయం ఇది. తండా శివారులోని అడవి అంచున హింగ్లాజ్, సీత్ల, మేరమ్మ, తులజ, ద్వళంగర్, మంత్రల్ అనే ఏడుగురు దేవతలను, వారి తమ్ముడు లూక్టియా దేవునిని గిరిజనులు నిష్టతో ప్రతిష్ఠిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పోచమ్మ, మైసమ్మలను కన్నతల్లిలా ఎలా కొలుస్తారో, గిరిజనులు ఈ ఏడుగురు అమ్మవార్లను తమ ఆపద్బాంధవులుగా నమ్ముతారు. వారిలో చిన్నదైన ‘సీత్ల’ దేవి పేరుతో జరిగే ఈ వేడుక, ఆషాఢంలో తండాల ఇళ్లలో ఆధ్యాత్మిక వెలుగులను నింపుతుంది.

పశుసంపదకు రక్షణే పరమావధి..
పచ్చని ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనులకు పశువులే వారి ఆర్థిక ప్రాణం. వర్షాకాలంలో గడ్డితో పాటు అంటువ్యాధులు కూడా పెరుగుతాయి కాబట్టి, తమ జీవాలను కాపాడాలని అమ్మవారిని వేడుకుంటారు. పండుగ రోజున తండా చివర ఉండే దేవతల గద్దెలను అడవిలో దొరికే రకరకాల పూలు, ఆకులతో ముస్తాబు చేస్తారు. పెళ్లి కాని యువతులు గుగ్గిలాలు, బెల్లంతో చేసిన నైవేద్యం, ఉల్లిపాయలను తీసుకువచ్చి దేవుని ముందు ఉంచుతారు. మేతకు వెళ్లిన ఆవులు క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు పూజారులు నిష్ఠగా ఉపవాసం ఉండి అమ్మవారిని ధ్యానిస్తారు.
‘దాటుడు పండుగ’..
సీత్ల సంబరంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం పశువులను ‘దాటించడం’. పూజలు ముగిశాక మేకలు, కోళ్లను బలి ఇచ్చి, లూక్టియా దేవుని గద్దె వద్ద ఆ జంతువుల పేగును కడతారు. ఆ పేగుపై నుంచి పశువులను దాటించడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం. అందుకే దీన్ని స్థానికులు ‘దాటుడు పండుగ’ అని భక్తితో పిలుస్తారు. అమ్మవారి నైవేద్యాన్ని పశువులపై చల్లడం ద్వారా, దేవత కటాక్షంతో జీవాలు వ్యాధుల బారిన పడవని వారి ప్రగాఢ విశ్వాసం.
సజీవ సంస్కృతి..
ఆషాఢ మాసంలోని ప్రతి మంగళవారం ఒక్కో తండాలో ఈ ఉత్సవం జరగడం వల్ల, నెల రోజుల పాటు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో పలకరిస్తుంది. సీత్ల పండుగ ముగిసిన మరుసటి రోజునే మరో గిరిజన పండుగ ‘తీజ్’ ప్రారంభమవుతుంది. ఆధునిక ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినా, తమ ఆచారాలను, ప్రకృతి ఆరాధనను విస్మరించకుండా, తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని గిరిజనులు సజీవంగా నిలబెడుతున్నారు. మూలాలను మరిచిపోని ఈ గిరిజన జీవనశైలికి సీత్ల పండుగ సాక్ష్యంగా నిలుస్తోంది.

