వర్షాలు కురవాలని గిరిజనుల పూజలు
రూప్లా నాయక్ తండా, జోద్య నాయక్ తండాల్లో సీత్లా వేడుకలు
సంప్రదాయ వస్త్రధారణతో అమ్మవారికి పూజలు
పంటలు పండాలని, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్ష
కాకతీయ, రుద్రంగి : వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పశుసంపద అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ రుద్రంగి మండలంలోని రూప్లా నాయక్ తండా, జోద్య నాయక్ తండాల్లో గిరిజనుల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే తండాల్లో భక్తి వాతావరణం నెలకొంది. ముందుగా పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం వాటిని అడవిలోకి విడిచిపెట్టారు. అనంతరం గిరిజన మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రధారణలో నైవేద్యాలను తలపై మోసుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా సీత్లా భవాని ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంప్రదాయాలకు ప్రతీక
ఈ సందర్భంగా రిటైర్డ్ ఏడీఈ భూక్య లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ, గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతికి ప్రతీకగా సీత్లా భవాని పండుగను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పండుగ వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని, పశుసంపద వృద్ధి చెందడంతో పాటు గ్రామాల్లో సుఖశాంతులు నెలకొంటాయని గిరిజనుల విశ్వాసమని పేర్కొన్నారు. ఈ ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భుక్య జవహర్ లాల్ నాయక్, ఉప సర్పంచ్ తిరుపతి నాయక్, రిటైర్డ్ ఏడీఈ భూక్య లక్ష్మణ్ నాయక్, పూజారి నారాయణ నాయక్, అంబర్ సింగ్ నాయక్, బాంకట్ లాల్ నాయక్, నర్సింగ్ నాయక్, దేవా నాయక్, భూమా నాయక్, చందర్ నాయక్, మాజీ సర్పంచ్ రాజు, శర్మన్, గోవింద్ నాయక్, తండా పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

