ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
ఆరోగ్యకర జీవనశైలిపై విద్యార్థినులకు అవగాహన
కాకతీయ, వేములవాడ : వేములవాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో హన్మాజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య నిపుణులు డా. ఎన్. స్వప్నలత, మహతి, జి. లలిత, సి.హెచ్. కవిత పాల్గొని విద్యార్థినులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. వైద్య బృందం కళాశాల వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించి, పరిశుభ్రత పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యత మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో వ్యాధులను ఎలా నివారించవచ్చో విద్యార్థినులకు వివరించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం : ప్రిన్సిపల్ డా. పి.ఎస్.ఆర్. శర్మ
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. పి.ఎస్.ఆర్. శర్మ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన విద్యార్థులే విద్యా రంగంలో రాణించగలరని, విద్యార్థుల ఆరోగ్య భద్రతకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి శిబిరాలు విద్యార్థినులలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. కె. లావణ్య, అకాడమిక్ కో-ఆర్డినేటర్ బి. సుమలత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి. స్వప్న, ఎన్ఎస్ఎస్ కౌన్సిల్ సభ్యులు, అధ్యాపక బృందం, వైద్య సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

