ఖమ్మం–బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
శుక్రవారం ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు అమలు
ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల సూచన
సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక రూట్లు
కాకతీయ, ఖమ్మం టౌన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం, జగన్నాథపురం (మత్కేపల్లి క్రాస్ రోడ్డు) వద్ద నిర్వహించనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ నేపథ్యంలో ఖమ్మం–బోనకల్ ప్రధాన రహదారిపై ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు వివరాలు:
ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఖమ్మం–బోనకల్ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. కేవలం సభకు వచ్చే రైతులు, ప్రజలు, అధికారులు, మీడియా వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఖమ్మం నుంచి బోనకల్/ఆంధ్ర వైపు వెళ్లే వాహనాలు: నేలకొండపల్లి మీదుగా పందిళ్లపల్లి, చింతకాని ద్వారా వెళ్లాలి.
బోనకల్ నుంచి ఖమ్మం వైపు వచ్చే వాహనాలు: వైరా మీదుగా రావాలి.
ధాంసలాపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు నుంచి బోనకల్ బ్రిడ్జి వరకు సాధారణ రాకపోకలు పూర్తిగా నిషేధించబడ్డాయి.
విఐపి వాహనాలు: హైదరాబాద్ నుంచి వచ్చే వారు కోదాడ, నేలకొండపల్లి, ముదిగొండలోని వల్లపురం మీదుగా సభాస్థలికి చేరుకోవచ్చు.
మండలాల వారీగా పార్కింగ్ మార్గాలు:సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మరియు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మండలాల వారీగా ప్రత్యేక రూట్లను కేటాయించామని సీపీ తెలిపారు:
రూట్ నెం. 1 (పార్కింగ్ 1–5): ఖమ్మం (టౌన్ & రూరల్), కామేపల్లి, నేలకొండపల్లి, ముదిగొండ, సింగరేణి, తిరుమలాయపాలెం మండలాల నుంచి వచ్చేవారు ఈ మార్గంలో రావాలి.
రూట్ నెం. 2 (పార్కింగ్ 7, 8, 15): చింతకాని, వైరా, ఏన్కూరు, దమ్మపేట, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, చండ్రుగొండ మండలాల నుంచి వచ్చేవారు ఈ మార్గాన్ని అనుసరించాలి.
రూట్ నెం. 3 (పార్కింగ్ 10–14): మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల నుంచి వచ్చేవారు ఈ మార్గంలో రావాలి.
విఐపి & వివిఐపి పార్కింగ్: పార్కింగ్ నెం. 6 (వివిఐపి), పార్కింగ్ నెం. 9 (విఐపి/ప్రభుత్వ అధికారులు)కు కేటాయించబడ్డాయి.
ప్రజలు, వాహనదారులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపివేయకుండా సభ విజయవంతానికి సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

