- రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు
- టీఎస్జేయూ ‘సే నో టు డ్రగ్స్ 2కే’ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ
- సామాజిక బాధ్యతతో జర్నలిస్టుల చొరవను అభినందించిన మంత్రి
- జూలై 23న హనుమకొండలో భారీ అవగాహన ర్యాలీ
కాకతీయ, హన్మకొండ : మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ఒక్కటే కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్జేయూ) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించనున్న ‘సే నో టు డ్రగ్స్ 2కే’ అవగాహన ర్యాలీ పోస్టర్ను మంత్రి కొండా సురేఖ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా, కుటుంబాలు మరియు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, విద్యాసంస్థలు మరియు ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని ఆమె సూచించారు. సామాజిక బాధ్యతతో టీఎస్జేయూ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు.
ర్యాలీని విజయవంతం చేయండి : టీఎస్జేయూ నేతలు
టీఎస్జేయూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం మాట్లాడుతూ, నిరంతర అవగాహన ద్వారానే యువతను డ్రగ్స్ నుంచి రక్షించగలమని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో చైతన్యం పెంపొందించడంలో జర్నలిస్టులు తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, కోశాధికారి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. జూలై 23న జరిగే ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్జేయూ రాష్ట్ర, జిల్లా నాయకులు వేణు, నగేష్ గౌడ్, నరేష్ గౌడ్, ఈద శ్రీనాథ్, నాగపురి అవినాష్, కౌడగాని మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

