- తాడిచర్ల కేంద్రంగా భారీ మెడికల్ మాఫియా!
- వ్యాధులు నయం చేస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ
- ఒక్కో రోగి నుంచి రూ. 5 వేల వసూలు.. చైన్ సిస్టమ్ మోసాలు!
- బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులు నయమవుతాయంటూ నమ్మబలుకుతున్న కేటుగాళ్లు
- రోగులనే ఏజెంట్లుగా మారుస్తూ నిలువునా మోసం!
- ముత్తారం, మంథని, మల్లారం ప్రాంతాలకు విస్తరిస్తున్న నెట్‌వర్క్
కాకతీయ, మల్హార్ : భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలకేంద్రం, తాడిచర్లలో అమాయక ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి, లక్షల రూపాయలు దోచుకుంటున్న ఒక పెద్ద ‘న్యూట్రిషన్ మెడికల్ మాఫియా’ దందా వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు తాడిచర్లలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, ఏమాత్రం నాణ్యత లేని న్యూట్రిషన్ పౌడర్ల పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులతో పాటు ఏ రకమైన దీర్ఘకాలిక వ్యాధులైనా పూర్తిగా నయం చేస్తామని ఈ ముఠా ఊదరగొడుతోంది. ఒక్కో రోగి నుంచి రూ. 5,000 వరకు వసూలు చేస్తూ, న్యూట్రిషన్ పౌడర్ డబ్బాలను అంటగడుతున్నారు. అయితే, తాము ఇస్తున్న మందులతో పాటు రోగులు గతంలో వాడుతున్న బీపీ, షుగర్ టాబ్లెట్లను కూడా కొనసాగించాలని వీరు సూచిస్తున్నారు. ఆ టాబ్లెట్ల వల్ల వ్యాధి అదుపులో ఉంటే.. అది తామిచ్చిన న్యూట్రిషన్ పౌడర్ల మహిమేనని ప్రజలను నమ్మిస్తూ, వారి సొమ్ముతో ఆడుకుంటున్నారు.
చైన్ సిస్టమ్.. ఊబిలోకి అమాయకులు!
ఈ మాఫియా చైన్ సిస్టమ్ ద్వారా నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. కస్టమర్లను ఏజెంట్లుగా మారుస్తూ, కొత్తవారిని చేరిస్తే కమిషన్ ఇస్తామని, ఎక్కువ మందిని చేరిస్తే భారీ లాభాలొస్తాయని ఆశచూపుతున్నారు. దీంతో డబ్బుల ఆశతో అమాయక గ్రామీణ ప్రజలు తమ బంధుమిత్రులను కూడా ఈ ఊబిలోకి లాగుతున్నారు. తాడిచర్లలో సక్సెస్ అయిన ఈ దందా, ఇప్పుడు ముత్తారం, ఖమ్మంపల్లి, మంథని, మల్లారం ప్రాంతాలకు పాకింది. అక్కడ కూడా కొత్త బ్రాంచ్‌లను ఓపెన్ చేసి అక్రమార్జనే ధ్యేయంగా రోజుకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ప్రజల నుంచి దండుకుంటున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మంట
గ్రామీణ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున మెడికల్ మాఫియా దందా సాగుతున్నా.. స్థానిక వైద్య ఆరోగ్య శాఖ, డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో, సొమ్ముతో ఆడుకుంటున్న ఈ ముఠాపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని, వారిని కఠినంగా శిక్షించాలని తాడిచర్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరికొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తాడిచర్లలోని ఈ అక్రమ వ్యాపార స్థావరాలపై దాడులు చేస్తారా? లేదా అన్నది వేచి చూడాలి.

