- కేసీఆర్ బయటకు వచ్చి నిజాలు చెబితే వీళ్లకు విలువుండదు
- తెలంగాణ రైతాంగానికి నీళ్లందించేందుకు కాళేశ్వరం సిద్ధంగా ఉంది
- ఇప్పటికైనా పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండి
- ఎల్ఎండీతో పాటు 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కరీంనగర్ దిగువ మానేరు జలాశయాన్ని సందర్శించిన కేటీఆర్

కాకతీయ, కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి ప్రజల ముందుకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న వాస్తవాలను చెబితే, కాంగ్రెస్ నాయకులను ప్రజలే నిలదీస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ లోని దిగువ మానేరు (ఎల్ఎండీ) జలాశయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మాజీ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తిని కాళేశ్వరం అవినీతి కేసుతో అనుసంధానం చేస్తూ జైలుకు పంపిస్తామని బెదిరించడం దురదృష్టకరమన్నారు.
రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయ విమర్శలతో కాలం గడపడం సరికాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాలువలు, మోటార్లు, సబ్స్టేషన్లు అన్నీ సక్రమంగానే ఉన్నాయని, ఒక్క ప్రభుత్వం సంకల్పంతో పంపులు ఆన్ చేస్తే రైతులకు వెంటనే సాగునీరు అందుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పంపులు ప్రారంభించి రైతులకు నీళ్లు ఇస్తే, ఆయనపై రాజకీయ విమర్శలు కూడా చేయబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక్క మాట చెబితే బీఆర్ఎస్ కార్యకర్తలే వెళ్లి పంపులు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే ఆయన సంయమనం పాటించాలని సూచించారని వెల్లడించారు.
తీవ్ర తాగునీటి సంక్షేమ ప్రమాదం
ప్రస్తుతం గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 20 శాతం కంటే తక్కువ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు సుమారు 9 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా, ప్రభుత్వం వాటిని వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా ఎల్ఎండీ జలాశయం నీటి కోసం ఎదురుచూస్తోందని, వెంటనే కాళేశ్వరం పంపులను నడపకపోతే కరీంనగర్‌తో పాటు ఎల్ఎండీపై ఆధారపడిన తొమ్మిది నియోజకవర్గాల్లో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలు పక్కనపెట్టి, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు, ప్రజలకు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

