73 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు
శంకర ఐ హాస్పిటల్‌లో సహకారంతో వైద్య సాయం
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరానికి విశేష స్పందన లభించింది. దేవాలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ కుమారుడు పవన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఎంపిక చేసిన 80 మందిని ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ సోమవారం 26 మందికి, మంగళవారం 47 మందికి కలిపి మొత్తం 73 మందికి విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు పెండ్యాల ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సినీ నటుడు, సంజోష్ ఫౌండేషన్ చైర్మన్ హీరో సంజోష్ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. వారికి పండ్లు పంపిణీ చేయడంతో పాటు, అవసరమైన కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన శంకర ఐ హాస్పిటల్ వైద్య బృందం, సంజోష్ ఫౌండేషన్, రాహుల్ ఐ ఫౌండేషన్ సిబ్బందికి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ పెండ్యాల ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

