రైస్ మిల్లర్ల మాయాజాలం
ఉమ్మడి కరీంనగర్లో రూ.609 కోట్ల అక్రమాలు
నిబంధనలను తుంగలో తొక్కి రీ-పాలిషింగ్ దందా
అనుమతులు రద్దయినా ఆగని బియ్యం తరలింపు
పాత బియ్యానికి కొత్త రూపం.. రూ.100 కోట్ల లాభమే లక్ష్యం
ఈడీ ఎంట్రీతో ఉలిక్కిపడుతున్న మిల్లర్లు
ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారం పెద్ద ఎత్తున అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కోట్ల రూపాయల విలువైన బియ్యం పక్కదారి పట్టడం, అనుమతులు లేకున్నా రీ-పాలిషింగ్ దందా కొనసాగుతుండటంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.4,235 కోట్ల సీఎంఆర్ అక్రమాలపై ఈడీ దర్యాప్తునకు ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో, స్థానికంగా ఉన్న రైస్ మిల్లర్లలో గుబులు మొదలైంది.
రూ.609 కోట్ల బకాయిలు.. కేసుల పరంపర
సీఎంఆర్ బియ్యం కేటాయింపుల్లో మిల్లర్ల అక్రమాలు తారస్థాయికి చేరాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రూ.182 కోట్లు, జగిత్యాల రూ.140 కోట్లు, రాజన్న సిరిసిల్ల రూ.69 కోట్లు, పెద్దపల్లి రూ.218 కోట్ల చొప్పున మొత్తం రూ.609 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే 18 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా, ఒకరిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. దాదాపు 38 మిల్లులను డిఫాల్టర్లుగా గుర్తించగా, మరో 20 మిల్లులపై విచారణ కొనసాగుతోంది. ఆర్ఆర్ యాక్ట్ కింద ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా, బకాయిలు రికవరీ కావడం లేదని సమాచారం.
అనుమతులు రద్దయినా ఆగని అక్రమ రీ-పాలిషింగ్
వేలంలో దక్కించుకున్న 56,500 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని రీ-పాలిషింగ్ చేసేందుకు ఒక ప్రముఖ రైస్ మిల్లర్ కలెక్టర్ వద్ద అనుమతులు పొందారు. అయితే, ఆ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించడంతో 11 రైస్ మిల్లుల అనుమతులను కలెక్టర్ రద్దు చేశారు. అయినా కూడా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, ఆ మిల్లర్ గోదాముల నుంచి బియ్యాన్ని లిఫ్ట్ చేస్తూనే ఉన్నారు. తన సొంత మిల్లులతో పాటు, బినామీ మిల్లుల్లో రీ-పాలిషింగ్ కొనసాగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మూడేళ్లుగా నిల్వ ఉన్న నాణ్యత లేని దొడ్డు బియ్యాన్ని ఇథనాల్ లేదా పశుగ్రాసం కోసం మాత్రమే వాడాల్సి ఉండగా, దాన్ని పలుమార్లు పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. క్వింటాలుకు రూ.2,170కి కొన్న బియ్యాన్ని, రూ.3,500 కంటే ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఈ దందా ద్వారా రూ.100 కోట్ల లాభం గడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈడీ దర్యాప్తుతో కలకలం
ఆహార భద్రత ప్రమాణాలను తుంగలో తొక్కి, నాణ్యత లేని బియ్యాన్ని ప్రజలకు అంటగడుతున్న ఈ మిల్లర్ల మాయాజాలంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.4,235 కోట్ల సీఎంఆర్ స్కాంపై ఈడీ రంగంలోకి దిగితే, బియ్యం వేలాలు, బినామీ లావాదేవీలు, రాజకీయ అండదండల వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో జిల్లాలోని అక్రమ మిల్లర్లలో వణుకు మొదలైంది. అధికారులు పౌరసరఫరాల శాఖ నిబంధనలను కఠినంగా అమలు చేసి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

