- మరో 10,000 ఎకరాల్లో సాగు విస్తరిస్తే పామాయిల్ ఫ్యాక్టరీ
- ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే ప్రత్యామ్నాయ పంటల సాగే శరణ్యం
- : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ములకలపల్లిలో ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : రైతుల ఆర్థిక స్థిరత్వానికి ఆయిల్ పామ్ సాగు బలమైన పునాది అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గిరిజనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ములకలపల్లి మండలంలో నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, నీటి సంరక్షణ, గోదావరి జలాల వినియోగం తదితర అంశాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనులకు రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ప్రతి మండలంలో గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్లు, ఉన్నతాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, మర్రి, వెదురు, చింత వంటి స్థానిక జాతుల మొక్కలను విస్తృతంగా నాటి అడవులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు అవసరం
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటికే 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా సాధారణం కంటే 20 నుంచి 30 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, బోర్లపై ఆధారపడి వరి సాగు చేయకుండా తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. పెసర, మినుము, కంది, అలసంద వంటి అపరాల సాగును విస్తరించాలని కోరారు. పత్తి సాగు చేసే రైతులు ప్రతి 4 లేదా 6 వరుసలకు ఒక వరుస కందిని అంతర పంటగా సాగు చేస్తే అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు.
10,000 ఎకరాల సాగైతే పామాయిల్ ఫ్యాక్టరీ
ములకలపల్లి మండలంలో ప్రస్తుతం 8,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, మరో 10,000 ఎకరాల్లో సాగు విస్తరిస్తే వెంటనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని మంత్రి ప్రకటించారు. పోడు భూముల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆయిల్ పామ్‌తో పాటు మునగ, పప్పుధాన్యాలను అంతర పంటలుగా సాగు చేస్తే అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రైతు తన పొలంలో ఫామ్ పాండ్ నిర్మించుకోవాలని సూచించారు.
జిల్లా ప్రథమ స్థానంలో ఉంది : కలెక్టర్ అంకిత్
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 90,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, ఈ ఏడాది కొత్తగా 15,000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించామని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ మిషన్ అపరాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కంది, మినుము విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి, కలెక్టర్ రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ సంస్థ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

