వేములవాడ ఆలయం పనులు 45 శాతం పూర్తి
ఆదర్శ పట్టణంగా వేములవాడ తీర్చిదిద్దడమే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ఇప్పటికే సుమారు 45 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన, ఆలయాభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే నాలుగు స్తంభాలపై ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. 49.50 లక్షల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డుకు వెళ్లే అప్రోచ్ సీసీ రోడ్డు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ప్రధాన రహదారుల విస్తరణ, మూడో వంతెన నిర్మాణం, మురుగునీటి సమస్యల పరిష్కారం వంటి కీలక పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్టీ, బీసీ, అంబేడ్కర్, క్రిస్టియన్ భవనాలు, షాదీఖానా నిర్మాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని వివరించారు. పట్టణాభివృద్ధి, ఆలయాభివృద్ధిని ప్రభుత్వం రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

