ఢిల్లీ నిరసనల్లో చేర్యాల కాంగ్రెస్ నేతలు
కాకతీయ, చేర్యాల: నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వారికి మద్దతుగా చేర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగ రావు, ఎండీ ఖాజా, అంబాల బుచ్చి రాములు, నీలం సన్నీ, మాజీ కౌన్సిలర్ చెవిటి లింగం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అక్రమంగా, దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, నీట్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని, విద్యార్థులపై బలప్రయోగం చేయడం, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

