- పీఎంఈజీపీ రుణాల్లో అక్రమాలు
- రూ.10 కోట్లకు పైగా సబ్సిడీల దుర్వినియోగం
- ప్రీ-ప్రైమరీ, ఆయా పోస్టుల్లో మెరిట్‌ను పక్కనపెట్టి నియామకాలు
- రెండు వ్యవహారాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపణలు
- రుణాలు, నియామకాల వివరాలను బహిరంగపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
- అక్రమాలకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) రుణాల మంజూరు, ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. ఈ రెండు వ్యవహారాలపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకాన్ని జిల్లాలో దళారులు, రాజకీయ నాయకులు, బ్యాంకు అధికారులు కుమ్మక్కై పక్కదారి పట్టించారని ఆరోపించారు. సత్తుపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేయకుండానే బినామీల పేర్లపై రూ.10 కోట్లకు పైగా సబ్సిడీలు విడుదల చేశారని విమర్శించారు. క్షేత్రస్థాయి పరిశీలన, జియో ట్యాగింగ్ నిబంధనలను పట్టించుకోకుండా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ) అధికారులు రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. నిజమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా నిరుద్యోగులకు రుణాలు నిరాకరిస్తూ, పలుకుబడి ఉన్న వారికి సబ్సిడీలు మంజూరు చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించి సత్తుపల్లి బ్రాంచ్ మేనేజర్‌తో పాటు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నియామకాల్లో మెరిట్‌కు తిలోదకాలు
ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు, ఆయా పోస్టుల భర్తీలోనూ నిబంధనలను ఉల్లంఘించారని సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంటర్వ్యూలు లేకుండా విద్యార్హతల ఆధారంగా మాత్రమే నియామకాలు చేపట్టాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో డీఈఓ కార్యాలయం ఇంటర్వ్యూలకు అదనపు మార్కులు కేటాయించి మెరిట్‌ను పక్కనపెట్టిందని విమర్శించారు. బీఈడీ, డీఈడీ వంటి ఉన్నత అర్హతలు ఉన్న అభ్యర్థులను విస్మరించి రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు చేపట్టారని ఆరోపించారు. జిల్లాలో భర్తీ చేసిన 114 పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ మార్కులు, అలాగే దరఖాస్తు చేసుకున్న 1,400 మందికి పైగా అభ్యర్థుల వివరాలను వెంటనే బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. పీఎంఈజీపీ కింద మంజూరైన రుణాలు, సంబంధిత యూనిట్ల ఉనికిపై స్వతంత్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన ఇండస్ట్రీస్, ఖాదీ, బ్యాంకింగ్, విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిసి నిలదీస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమల రావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, యలమద్ది రవి, బలుసు మురళీకృష్ణ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

