- ఓటర్ల సౌకర్యాలపై ఆర్‌డీఓ కృష్ణవేణి సమీక్ష
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల నమోదు అధికారి, ఆర్‌డీఓ కృష్ణవేణి గురువారం పరిశీలించారు. ప్రస్తుతం చిట్యాల గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని భూపతిపూర్‌కు మార్చే ప్రతిపాదన నేపథ్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయనున్న కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు అవసరమైన ర్యాంప్, మరుగుదొడ్లు, భవనం స్థితి, ఇతర మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేంద్రం ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా అనే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం భూపతిపూర్ గ్రామస్థులతో మాట్లాడిన ఆర్‌డీఓ కృష్ణవేణి చిట్యాల నుంచి భూపతిపూర్‌కు పోలింగ్ కేంద్రాన్ని మార్చే ప్రతిపాదనపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో డిప్యూటీ తహసీల్దార్ కిషోర్, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

