- 58 కేసుల నమోదు..151 మంది బాల కార్మికుల రక్షణ
- చిన్నారులను విద్యాబాట పట్టించే దిశగా చర్యలు
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు ప్రతి చిన్నారికి విద్య హక్కు కల్పించాలనే లక్ష్యంతో నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-12 విజయవంతంగా ముగిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నేతృత్వంలో పోలీసు, కార్మిక శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్-1098, సమగ్ర బాలల పరిరక్షణ పథకం (ఐసీపీఎస్), రెవెన్యూ, విద్యాశాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో జూలై 1 నుంచి 31 వరకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ బాలరక్ష భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి మాట్లాడుతూ, జిల్లాలోని 16 మండలాలను కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, హుజురాబాద్, టాస్క్‌ఫోర్స్‌గా నాలుగు విభాగాలుగా విభజించి ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి బృందంలో పోలీసు అధికారులు, కార్మిక శాఖ సిబ్బంది, ఐసీపీఎస్ అధికారులు, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధులు పాల్గొని హోటళ్లు, దాబాలు, నిర్మాణ ప్రదేశాలు, క్వారీలు, దుకాణాలు, రహదారి నిర్మాణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ తనిఖీల్లో మొత్తం 151 మంది చిన్నారులను గుర్తించి రక్షించినట్లు వెల్లడించారు. వీరిలో 147 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారని తెలిపారు. కరీంనగర్ అర్బన్‌లో 48 మంది, రూరల్‌లో 37 మంది, హుజురాబాద్‌లో 39 మంది, టాస్క్‌ఫోర్స్ పరిధిలో 27 మంది చిన్నారులను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, బాల కార్మిక వ్యవస్థ చట్టవిరుద్ధమని అవగాహన కల్పించి, తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించి వారి స్వస్థలాలకు పంపించినట్లు తెలిపారు. పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.రక్షించిన చిన్నారుల్లో తెలంగాణతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, నేపాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై ఫిర్యాదుల మేరకు జిల్లావ్యాప్తంగా 58 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే కార్మిక శాఖ అధికారులు 113 మంది చిన్నారులకు యజమానుల ద్వారా కనీస వేతనాలు ఇప్పించినట్లు వివరించారు.
జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, కే. విజయ్‌కుమార్, రాధ, అర్చనతో పాటు పోలీసు, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్-1098, సమగ్ర బాలల పరిరక్షణ పథకం అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

