నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ‘మరణ శాసనం’
హామీలన్నీ నీటిమూటలే : బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి
ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వాన్ని నిలదీత
కాకతీయ, ఖమ్మం : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ నిరుద్యోగుల పాలిట మరణ శాసనంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. మధిర నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి గడ్డం వేణు గౌడ్‌ను పరామర్శించిన అనంతరం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న యువతకు సరైన జాబ్ క్యాలెండర్ లేకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం వల్లే గడ్డం వేణు గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని అన్నారు. వేణు రాసిన సూసైడ్ నోట్ తెలంగాణ నిరుద్యోగుల ఆవేదనకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఆ నోట్‌ను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, యూత్ డిక్లరేషన్ హామీలు అమలు కాలేదని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, జీవో 46 రద్దు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కానిస్టేబుల్, ఎస్సై దరఖాస్తులకు భారీ ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. వేణుకు అత్యుత్తమ వైద్యం అందించాలని, రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలని, పక్కా ఇల్లు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న 19 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని, కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలని, స్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గూడా సంజీవ్ రెడ్డి, బలుసు మురళీకృష్ణ, మద్దెల విజయ్ కుమార్, ఈదుల రాజేష్, షారూక్, జడల కళ్యాణ్, సాయిదీప్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

