ఏఐ ఎంట్రీతో బోగస్ మస్టర్ల గుట్టురట్టు అవుతుందా..?
ఉపాధి పనుల్లో అక్రమాలపై డిజిటల్ ఉక్కుపాదం
జియో ట్యాగ్ ఫొటోలతో కూలీల హాజరుపై నిఘా
పనులు చేయకుండానే బిల్లులు.. తప్పుడు మస్టర్లకు చెక్
తేడాలు తేలితే రికవరీతో పాటు క్రిమినల్ కేసులు
కాకతీయ, కరీంనగర్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న బోగస్ మస్టర్లు, నకిలీ హాజరు, పనులు చేయకుండానే బిల్లుల చెల్లింపుల ఆరోపణలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం కృత్రిమ మేధ (ఏఐ)ను రంగంలోకి దించింది. కూలీల హాజరు నుంచి పనుల పురోగతి వరకు ప్రతి అంశాన్ని ఏఐ విశ్లేషించనుండటంతో, ఇప్పటివరకు దాగి ఉన్న అక్రమాలు బయటపడతాయా? అనే చర్చ మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో నమోదై ఉన్నారు. ప్రతిరోజూ పనిస్థలాల్లో తీసే జియో ట్యాగ్ ఫొటోలను ఏఐ పరిశీలించి, హాజరు, పనుల పురోగతి, స్థల వివరాలను సరిపోల్చనుంది. ఒకే వ్యక్తి పేరు పలుచోట్ల నమోదు కావడం, పనిస్థలంలో లేకుండానే హాజరు చూపించడం, వాస్తవ పనికి మించిన బిల్లులు నమోదు చేయడం వంటి అంశాలు తేలితే వెంటనే గుర్తించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అక్రమాలకు చెక్ పడుతుందా..?
గతంలో పలు ప్రాంతాల్లో బోగస్ మస్టర్లు, పనులు పూర్తి కాకుండానే బిల్లులు, నకిలీ కొలతలపై ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు ఏఐ వ్యవస్థ అమలుతో అలాంటి అవకతవకలను గుర్తించడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే కేవలం సాంకేతికతను ప్రవేశపెట్టడం సరిపోదని, ఏఐ గుర్తించిన లోపాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏఐ విశ్లేషణలో నకిలీ హాజరు, తప్పుడు బిల్లులు, బోగస్ చెల్లింపులు లేదా ఇతర అవకతవకలు బయటపడితే ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడంతో పాటు సంబంధిత అధికారులపై, బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉపాధి హామీ పనుల అమలులో పారదర్శకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అసలు పరీక్ష అమలులోనే..!
ఏఐ వ్యవస్థ ప్రవేశంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా? లేక కొత్త విధానాన్ని కూడా దాటవేసే మార్గాలను కొందరు వెతుకుతారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో నమోదైన ఫిర్యాదులు, పెండింగ్ విచారణలు, రికవరీ కేసులను కూడా ఏఐ ఆధారిత విశ్లేషణతో అనుసంధానిస్తే ఉపాధి హామీ పథకంలో ఉన్న బోగస్ వ్యవస్థ పూర్తిగా బయటపడే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

