బట్ట కాల్చి మీద వేయడమే హరీశ్ రావు పని
ముందు కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పాలి
ఏపీతో కుమ్మక్కై ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు
తెలంగాణ నీటి ప్రయోజనాలపై బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం
నెలాఖరులో సమ్మక్క సాగర్‌కు ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్ఓసీ
రాష్ట్ర ప్రయోజనాలపై సంక్షేమం, అభివృద్ధిపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవాలని, కట్టు కథలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “తప్పుడు ప్రచారం మానుకోండి… కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడమే హరీశ్ రావు పని” అని ఆయన ధ్వజమెత్తారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు ముడుపుల వ్యవహారంపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేయాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి… ఏపీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా ప్రతి జీఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూనే వస్తోందని, అది కొత్త విషయం కాదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కోలేదని ఆరోపించారు.
‘తొమ్మిదిన్నరేళ్లు ఏం చేశారు..?’
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగాయని, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ముందుకు వెళ్లిందని, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయిందని గుర్తుచేశారు. తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ ప్రయోజనాలను కాపాడకుండా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. ఈ నెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశ అజెండాలో ఉన్న అంశాలు కొత్తవి కాదని, గత సమావేశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చిందన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ఇదే తరహా అభ్యంతరాలు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లి 2025 ఏప్రిల్ 24న టీఏసీ అనుమతులు సాధించిందని తెలిపారు.
‘ఏపీ అభ్యంతరాలను సమర్థంగా తిప్పికొట్టాం’
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంటవాగు, గూడెం లిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, జలశక్తి మంత్రిత్వ శాఖకు వరుసగా లేఖలు రాస్తోందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అభ్యంతరాన్ని సమర్థంగా తిప్పికొట్టి తెలంగాణ హక్కులను కాపాడిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడో జీఆర్ఎంబీ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరిందని, రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా అదే వైఖరి అవలంబించిందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి ట్రిబ్యునల్ ఏర్పాటు కాకుండా అడ్డుకుందని పేర్కొన్నారు.
‘సమ్మక్క సాగర్‌కు నెలాఖరులో ఎన్ఓసీ’
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఒక్కసారి కూడా చర్చలు జరపలేదని ఉత్తమ్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మూడు సార్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కలిసి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలని కోరిందన్నారు. ఈ నెలాఖరులో ఎన్ఓసీ ఇస్తామని ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సీతమ్మ సాగర్-సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతులు సాధించడంతో పాటు 60 టీఎంసీల నీటి కేటాయింపులు కూడా సాధించిందన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు.
‘సుప్రీంకోర్టులోనూ పోరాటం కొనసాగుతోంది’
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రెండు సార్లు, తాను ఏడు సార్లు, ప్రధాన కార్యదర్శి పది సార్లు, ఈఎన్సీ 19 సార్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ, పీపీఏ అధికారులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. న్యాయపరంగా కూడా సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్, ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. నాలుగు వారాల్లోగా ప్రతివాదులు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందన్నారు. 2018-2022 మధ్య రాయలసీమ ప్రాంతానికి 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించలేదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులను ఒప్పించి ముందుకు వెళ్లామని, బీఆర్ఎస్ హయాంలో అలాంటి ప్రయత్నం ఒక్కటైనా జరిగిందా అని నిలదీశారు. కృష్ణా జలాల వాటా కోసం ట్రిబ్యునల్ ముందు స్వయంగా హాజరై రాష్ట్ర తరఫున బలమైన వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. చివరగా హరీశ్ రావును ఉద్దేశించి… “ముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందాయన్న కవిత ఆరోపణలకు సమాధానం చెప్పు. ఆ ముడుపుల్లో నీ వాటా ఎంత? తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమని భావించి ఏపీతో కుమ్మక్కై నాగార్జునసాగర్‌ను వివాదంలోకి నెట్టింది మీరే కాదా? లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ముంచి ఇప్పుడు సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్నారా?” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

