రూ.100 కోట్లతో ఏదులాపురం రూపురేఖలు మారుస్తాం
రాష్ట్రంలోనే ఆదర్శ మునిసిపాలిటీ తీర్చిదిద్దుతాం
ముఖ్యమంత్రి చొరవతోనే భారీగా నిధుల మంజూరు
ప్రతి కాలనీలో మౌలిక వసతులే ప్రభుత్వ లక్ష్యం
త్రాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
కాకతీయ, మయూరి సెంటర్ : ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఏదులాపురం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని కల్పించి, ఈ మున్సిపాలిటీని రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, ఇందిరమ్మ కాలనీల్లో కాలినడకన పర్యటించిన మంత్రి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య పరిస్థితులు, మౌలిక వసతులను పరిశీలించారు. స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రజల సమస్యలే ప్రభుత్వ ప్రాధాన్యం
లోతట్టు ప్రాంతాల్లో తుమ్మ చెట్లు పెరగడం, వర్షపు నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించామని, వాటి శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కొన్ని కాలనీల్లో త్రాగునీటి సమస్య ఉందని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, దానిని అత్యంత ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని చెప్పారు. విద్యుత్ తీగలకు సంబంధించిన సమస్యలను కూడా సంబంధిత శాఖల సమన్వయంతో వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కోసం వచ్చిన వినతులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పార్కుల అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెలాఖరులోగా వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి అభివృద్ధి పనిని అధికారులు నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
వర్షంలోనూ ప్రజల మధ్యే…
పర్యటనలో భాగంగా సాయిగణేష్ నగర్‌లో రోడ్డు పక్కనున్న టీ స్టాల్‌లో కూర్చుని టీ తాగిన మంత్రి, అనంతరం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగు పట్టుకుని ఇందిరమ్మ కాలనీలో కాలినడకన పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఆర్ అండ్ బి ఎస్‌ఈ యుగంధర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసచారి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

