మోదీ విధానాలతో దేశం అప్పుల ఊబిలోకి
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్రం
ధరల భారంతో సామాన్యుల జీవనం అతలాకుతలం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గాడితప్పకుండా చూడాలి
కాకతీయ, చిగురుమామిడి : దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, కార్పొరేట్, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బీజేపీ పాలనకు రానున్న రోజుల్లో చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు రేకొండ, పీచుపల్లి, ముల్కనూర్, సీతారాంపూర్, లంబాడిపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ఓగులాపూర్, ముదిమాణిక్యం, రామంచ గ్రామాల్లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతా ఆదివారం కొనసాగింది. మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ విధానాల కారణంగానే దేశం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందన్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సామాన్యులపై కేంద్రం పెనుభారం మోపుతోందని ఆరోపించారు. ధరల పెరుగుదలతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా సాగాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గాడితప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి సూచించారు. ధరల పెరుగుదల, ప్రజా సమస్యలపై సీపీఐ పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. సెప్టెంబరు 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ జాగీరీ సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జాతా కోఆర్డినేటర్లు గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్‌రెడ్డి, అందె చిన్నస్వామి, బోయిని వల్లభాయ్ పటేల్, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, తేరాల సత్యనారాయణ, ముద్రకోల రాజయ్య, మావురపు రాజు, మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బీర్ల పద్మ, కొట్టె అంజలి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బామండ్లపెల్లి యుగేందర్, నర్రావుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

