ఆగమ శాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి
గర్భాలయం, మహామండపం యథాతథంగా ఉంటాయి
శిఖరాన్ని శిలామయంగా నిర్మించి నాలుగు అడుగుల మేర పెంచే యోచన
రూ.250 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు
భక్తులు ఎలాంటి అపోహలు నమ్మవద్దు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్ర నిబంధనలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై స్పష్టత కోసం అధికారులు, ఆలయ అర్చకులతో కలిసి శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారిని కలిసి వివరాలను సమర్పించినట్లు తెలిపారు. గర్భాలయం, మహామండపం విషయంలో భక్తుల్లో నెలకొన్న అనుమానాలను పీఠాధిపతి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. గర్భాలయం, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదా తొలగించడం లేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా, పత్రికల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి భక్తులు ఆందోళన చెందవద్దని సూచించారు.
రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే సుమారు రూ.250 కోట్ల నిధులు కేటాయించిందని, ప్రస్తుతం దాదాపు 55 శాతం పనులు పూర్తయ్యాయని ఆది శ్రీనివాస్ తెలిపారు. గతంలో రూ.50 కోట్లు, అనంతరం రూ.100 కోట్లు, తాజాగా రూ.99.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఉన్న శిఖరం 1973లో నిర్మించబడిందని తెలిపారు. దానిని శిలామయంగా పునర్నిర్మించి సుమారు నాలుగు అడుగుల మేర ఎత్తు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయ శిఖరాన్ని నిర్మించాలని శృంగేరి పీఠాధిపతి సూచించినట్లు తెలిపారు. నిర్మాణానికి ముందు భూమి బలం, నిర్మాణ స్థిరత్వం తదితర సాంకేతిక అంశాలను పూర్తిగా పరిశీలించాలని పీఠాధిపతి సూచించినట్లు వివరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అనివెట్టి మండపాన్ని ఆధునికంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాచీనత, సంప్రదాయాలను కాపాడుతూ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆశీస్సులతో పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు, ఆలయ అర్చకులు తెలిపారు.

