రూ.4.15 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన
నాణ్యతతో పనులు.. నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి
రోడ్లపై అక్రమ ర్యాంపులు, దుకాణాలు తొలగించాలని ఆదేశం
ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్
కాకతీయ, ఖమ్మం టౌన్ : ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్, రోడ్ నంబర్ 10, శ్రీరామ్‌నగర్‌లో వివిధ నిధుల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్‌ఆర్‌ఎస్, మున్సిపల్ జనరల్, సుడా, అర్బన్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిధులతో మొత్తం రూ.4.15 కోట్ల 60 వేల వ్యయంతో చేపడుతున్న సీసీ కాలువలు, కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని మున్సిపల్, సుడా అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనులు చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. డివిజన్‌లో రోడ్లపై అక్రమంగా నిర్మించిన ర్యాంపులు, దుకాణాలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ టీపీఎస్, టీపీవోలకు ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న కాలువలకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని విద్యుత్ అధికారులను కోరారు. కాల్వకట్టపై నివసిస్తున్న పేద కుటుంబాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని దుర్గ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, మాజీ మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహర్, దొబ్బల సౌజన్య, కమర్తపు మురళి, గౌస్, హుస్సేన్, అధికారులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

