ఖమ్మంలో తుమ్మల అరాచకాలు
మంత్రి, ఆయన కుమారుడి అండతో మైనింగ్, భూ దందాలు
గతంలో నాపై ప్రచారం చేసినవారే ఇప్పుడు తుమ్మల వెంట
ఖమ్మం అభివృద్ధిపై తుమ్మల శ్వేతపత్రం విడుదల చేయాలి
సీతారామ ప్రాజెక్టులో నాణ్యత డొల్లతనం బయట పడుతోంది..!
కేసీఆర్ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేస్తోంది
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు
కాకతీయ, ఖమ్మం టౌన్: ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి తుమ్మల, ఆయన కుమారుడి అండతో ఇసుక, మట్టి, భూ అక్రమాలు సాగుతున్నాయని ఆరోపించారు. గతంలో తనపై ‘కాశీం రజ్వీ’ అంటూ తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులే ఇప్పుడు తుమ్మల వెంట తిరుగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలి పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మంత్రి, ఆయన కుమారుడి అండతో కొందరు ఇసుక, మట్టి, భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పువ్వాడ ప్రశ్నించారు. గతంలో తనపై తీవ్ర ఆరోపణలు చేసినవారే ఇప్పుడు అధికార పార్టీ నేతల చుట్టూ చేరి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం అండగా ఉంటే ఏం చేసినా చెల్లుతుందన్న పరిస్థితి ఖమ్మంలో నెలకొన్నదా? అని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు కల్పించినా బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వీడలేదని, పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, తమపై జరుగుతున్న ప్రతి దానికి తగిన సమాధానం చెబుతామని అన్నారు.
ఖమ్మానికి తుమ్మల చేసిందేమిటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని పువ్వాడ పేర్కొన్నారు. ఖమ్మం అభివృద్ధిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకునే ప్రత్యేకమైన పని ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తుమ్మల ఏ పార్టీలో ఉన్నా మంత్రి పదవులు అనుభవించారని, కానీ ఖమ్మం అభివృద్ధికి ఆయన చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. తాను ఇకముందూ ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని పువ్వాడ స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. నాలుగు దశాబ్దాలుగా పువ్వాడ కుటుంబానికి ఖమ్మంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. సోషల్ మీడియాలో తన పేరు కనిపిస్తే కొందరు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయని పువ్వాడ ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఏడాదికే కాలువ సీసీ లైనింగ్ దెబ్బతినడం ప్రాజెక్టు నాణ్యతపై అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజాధనంతో చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే భవిష్యత్తులో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.
కేంద్రం రోడ్డుకు.. క్రెడిట్ ఎవరిది?
దేవరపల్లి–ఖమ్మం జాతీయ రహదారి విషయంలోనూ మంత్రి తుమ్మలపై పువ్వాడ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారికి రాష్ట్ర మంత్రి క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రజల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మున్నేరుపై తీగల వంతెన, రక్షణ గోడలు, ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణాలకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పువ్వాడ తెలిపారు. వాటికి నిధులు విడుదల చేసి, జీవోలు జారీ చేసింది నాటి ప్రభుత్వమేనన్నారు. మున్నేరు వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే రక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు. ఖమ్మం బస్‌స్టాండ్ నిర్మాణం, గోళ్లపాడు చానల్ అభివృద్ధి వంటి పనులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వం వేసిన పునాదులపై పనులు కొనసాగిస్తూ.. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలన అట్టర్‌ఫ్లాప్ సినిమా మాదిరిగా మారిందని పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

