ఎమ్మెల్యే సార్..! ఇదేం రాజకీయ నీతి..?!
సీఎం సభకు ఇనుగాలను దూరం పెట్టిన రేవూరి
పదేళ్లుగా పరకాలలో పార్టీని నిలబెట్టిన నేతపై అణిచివేత..?!
ఎమ్మెల్యే రాజకీయ కుట్రలంటూ కాంగ్రెస్‌లో విస్తృత చర్చ
సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత.. ఇనుగాల వర్గంలో మనస్తాపం
ఎన్నికలకు పదిరోజుల ముందు వచ్చిన రేవూరి.. గెలుపులో ఇనుగాల కీలక పాత్ర
కలిసి నడుద్దామంటూనే నియోజకవర్గానికి నేతను దూరం చేసే యత్నం
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడి గైర్హాజరుపై పీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే చర్చ
పరకాల కాంగ్రెస్‌లో హై వోల్టేజీ రాజకీయ చర్చ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పరకాలలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న సభకు హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆహ్వానించకపోవడం కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నియోజకవర్గంలో పదేళ్లుగా పార్టీని నిలబెట్టిన ఇనుగాలను ముఖ్యమంత్రి సభకు దూరం పెట్టడం వెనుక ఎమ్మెల్యే రాజకీయ వ్యూహం ఉందా..? ఆయనను రాజకీయంగా అణిచివేసే కుట్రలు మొదలయ్యాయా..? అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్‌తో సంబంధం లేని పబ్లిక్ మీటింగ్‌కు కూడా ఇనుగాలను ఆహ్వానించకపోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజా పరిణామంతో ఇనుగాల అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న చర్చకు ఈ ఘటన మరింత ఊతమిచ్చింది.
సీఎం సభకు ఇనుగాలకు ఆహ్వానించని రేవూరి..!
సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న పరకాల సభకు ఇనుగాల వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొటోకాల్‌తో సంబంధం లేని పబ్లిక్ మీటింగ్ అయినప్పటికీ పార్టీకి చెందిన కీలక నేతగా, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఇనుగాలను పిలవకపోవడానికి కారణమేంటని ప్రశ్నిస్తున్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఇనుగాలకు పరకాలపై మంచి పట్టు ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ కండువా సైతం కప్పుకోకుండానే పార్టీ టికెట్ ఖరారు చేసుకోవడం వెనుక తెరవెనుక అనేక అంశాలు ప్రభావం చూపినట్లు వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు రేవూరి అనుచరులు సైతం పరకాల ఎమ్మెల్యేగా ఆయన గెలుపునకు ఇనుగాల పూర్తి స్థాయి సహకారం అందించారన్న విషయాన్ని గుర్తుచేస్తుండటం గమనార్హం. అలాంటి నేతను కనీసం సీఎం సభకు కూడా ఆహ్వానించకపోవడంపై మాత్రం పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పదేళ్ల పార్టీ సేవ.. రేవూరి గెలుపులో కీలక పాత్ర
పరకాలలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలోనూ ఇనుగాల వెంకట్రామిరెడ్డి పదేళ్లపాటు పార్టీని కాపాడుతూ కార్యకర్తలకు అండగా నిలిచారని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నేతగా నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెబుతున్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎన్నికలకు కేవలం పదిరోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, ఆ సమయంలో పార్టీ అభ్యర్థిత్వం, ఎన్నికల సమీకరణలు, కార్యకర్తల సమన్వయంలో ఇనుగాల కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఇనుగాల సాయంతోనే రేవూరి గట్టెక్కారని, ఎన్నికల సమయంలో సహకరించిన నేతను ఇప్పుడు రాజకీయంగా దూరం చేయడం కృతజ్ఞతా రాహిత్యమేనని విమర్శిస్తున్నారు. కలిసి నడుద్దామని చెబుతూనే ఇనుగాల రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.
ఇనుగాలను అణిచివేసే కుట్రలపై చర్చ
ఎన్నికల గెలుపు తర్వాత క్రమంగా నియోజకవర్గంలో ఇనుగాల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలను రేవూరి ప్రారంభించారన్న చర్చ కాంగ్రెస్‌లో ఉంది. ఇప్పుడు సీఎం సభకు ఆహ్వానించకపోవడం కూడా అదే రాజకీయ వ్యూహంలో భాగమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ఇనుగాలకు ఉన్న పట్టు, కార్యకర్తలతో ఉన్న అనుబంధాన్ని తగ్గించి ఆయనను రాజకీయంగా బలహీనపరిచేందుకు ఎమ్మెల్యే ఒక్కో అడుగు వేస్తున్నారా అనే అంశంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కలిసి నడుద్దామంటూనే నియోజకవర్గ రాజకీయాలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇనుగాల వర్గీయుల నుంచి వస్తున్నాయి. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నేత ప్రాధాన్యాన్ని తగ్గించడం వల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఎక్కడ..?
సీఎం రేవంత్‌రెడ్డి సభ వేదికపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఉన్న సమయంలో హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి లేకపోవడంపైనా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఇనుగాలను కీలక కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు వేదికపై ఉండగా డీసీసీ అధ్యక్షుడు లేకపోవడం ఎలా జరిగిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు సైతం ఎలా మిన్నకుండిపోతారంటూ కొంతమంది ఇనుగాల వర్గీయులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడి భాగస్వామ్యం లేకపోవడం పార్టీ అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని పలువురు నాయకులు అంటున్నారు.
సొంత పార్టీలోనే రేవూరిపై వ్యతిరేకత
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వ్యవహారశైలిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న చర్చ కొనసాగుతోంది. ఇనుగాలను రాజకీయంగా అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భావన బలపడితే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందని కొందరు నేతలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం పదేళ్లుగా పనిచేసిన నాయకుడికి కనీస గౌరవం ఇవ్వకపోవడం కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని అంటున్నారు. ఇనుగాల వర్గంలో నెలకొన్న మనస్తాపాన్ని తొలగించి నేతలందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు కొనసాగితే నాయకుల మధ్య దూరం పెరిగి పార్టీ కేడర్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
పరకాల కాంగ్రెస్‌లో హై వోల్టేజీ
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడైన ఇనుగాల వెంకట్రామిరెడ్డిని సీఎం సభకు దూరం పెట్టడం, ఆయనకు నియోజకవర్గంలో ఉన్న రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలపై చర్చ జరగడం, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ సమక్షంలోనే డీసీసీ అధ్యక్షుడి గైర్హాజరు అంశం తెరపైకి రావడం, ఎమ్మెల్యే రేవూరి తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవడం పరకాల కాంగ్రెస్‌లో హై వోల్టేజీ చర్చకు దారితీసింది. ఇనుగాలను రాజకీయంగా అణిచివేస్తున్నారన్న ప్రచారానికి పార్టీ నాయకత్వం ఎలా తెరదించుతుంది, రేవూరి–ఇనుగాల మధ్య రాజకీయ సమీకరణాలు ఎటు మళ్లుతాయి, భవిష్యత్తులో ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

