హత్య కేసులో ఏ1కు జీవిత ఖైదు
రూ.3 వేల జరిమానా విధించిన పీడీజే కోర్టు
ఏ2 జాంబోజి శివకుమార్ నిర్దోషిగా విడుదల
దేశ్రాజ్పల్లిలో 2023లో మహిళ హత్య
పకడ్బందీ దర్యాప్తుపై పోలీసు బృందానికి సీపీ అభినందన
కాకతీయ, కరీంనగర్: దేశ్రాజ్పల్లి గ్రామంలో 2023 మార్చి 13న జరిగిన మామిడిపల్లి అనిత (50) హత్య కేసులో ఏ1 నిందితుడు తాడగొండ దామోదర్ (34)కు పీడీజే కోర్టు జీవిత ఖైదు, రూ.3 వేల జరిమానా విధించింది. ఏ2 జాంబోజి శివకుమార్ (23)ను నిర్దోషిగా ప్రకటించింది. పీడీజే కోర్టు న్యాయమూర్తి ఎస్.శివకుమార్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. అనిత పగటి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటుందనే విషయం తెలుసుకున్న దామోదర్, శివకుమార్‌లు డబ్బు అవసరంతో ఆమెను రూ.30 వేలు అప్పుగా అడిగారు. ఆమె నిరాకరించడంతో హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకోవాలని పథకం వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇంటికి వెళ్లి హత్య చేసి ఆభరణాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లినట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్ వాదనలు వినిపించారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి శ్రీధర్ (రామడుగు), ఏఎస్సై సత్తయ్య, సీఎంఎస్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారు. నేర నిరూపణకు కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్ బృందాలను సీపీ గౌష్ ఆలం అభినందించారు.

