హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్!
క్యాంపస్ ఏర్పాటుకు లండన్ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు
విస్తృత విద్యా కోర్సులు, కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక
ఎల్‌ఎస్‌ఈ, ఎస్‌ఓఏఎస్ ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ బృందం భేటీ
సీఎం ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో లండన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం
కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ కృషి చేస్తోందని ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి తెలిపారు. లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో సీఎం నేతృత్వంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లండన్ యూనివర్సిటీ ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమైంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ అధికారులు కే. రామకృష్ణారావు, జయేశ్ రంజన్ పాల్గొన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్‌ఎస్‌ఈ), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్‌ఓఏఎస్) ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్‌లో లండన్ యూనివర్సిటీకి చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా విస్తృత స్థాయిలో విద్యా కోర్సులు, కార్యక్రమాలు అందించాలని యోచిస్తున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు. వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్‌గా అనుసంధానించే విధంగా కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు తెలిపారు.

