బీసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బీపీ మండల్
హనుమకొండ రాంనగర్ బీసీ భవన్లో ఘనంగా జయంతి వేడుకలు
సామాజిక న్యాయానికి మండల్ కమిషన్ బలమైన పునాది
యువత ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్రాజ్ యాదవ్
కాకతీయ, హనుమకొండ : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బీపీ మండల్ అని మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్రాజ్ యాదవ్ అన్నారు. హనుమకొండ రాంనగర్లోని బీసీ భవన్లో మంగళవారం బీపీ మండల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుందర్రాజ్ యాదవ్ హాజరై బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు న్యాయం అందించాలనే లక్ష్యంతో బీపీ మండల్ పనిచేశారని గుర్తుచేశారు. ఆయన నాయకత్వంలో ఏర్పడిన మండల్ కమిషన్ భారతదేశ సామాజిక చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందన్నారు. వెనుకబడిన వర్గాల సామాజిక, విద్యా పరిస్థితులను అధ్యయనం చేసి వారికి తగిన అవకాశాలు కల్పించేందుకు సిఫారసులు చేయడం ద్వారా బీపీ మండల్ సామాజిక సమానత్వానికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. యువత బీపీ మండల్ జీవితం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సుందర్రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఉద్యమకారుడు గంగాపురం వేణుమాధవ్ గౌడ్, మేనం శ్యామ్, యాదగిరి గౌడ్, నాగరాజు యాదవ్, చిరంజీవి యాదవ్, యుగేందర్ యాదవ్, బీసీ మహిళా నాయకులు పద్మజ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

