కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్
కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి
కాకతీయ, చేర్యాల : కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించేది ఏఐటీయూసీ మాత్రమేనని ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్ అన్నారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. 1920లో ఆవిర్భవించిన ఏఐటీయూసీ 105 సంవత్సరాలుగా కార్మికుల హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతోపాటు సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. అసంఘటిత రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, నిర్మాణ కార్మికులు సహా అన్ని వర్గాల శ్రామికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కర్రె ఆంజనేయులు, పాల సాయిరెడ్డి, ఈరి భూమయ్య, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, పోషబోయిన పరమశేఖర్, బియ్య బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

