420 హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా..?
కాంగ్రెస్ దగా పాలనపై ప్రజలకు విసుగొచ్చింది
కాంగ్రెస్ 1000 రోజుల మోసపూరిత పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి
సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు వరుసగా నిరసన కార్యక్రమాలు
హామీలు నెరవేర్చే వరకు పోరాడుతాం
నగరంలో జరుగుతున్న భూ కబ్జాల వెనుక ఎమ్మెల్యే
ఆయన కనుసన్నల్లోనే అనేక దారుణాలు
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజం
కాకతీయ, హన్మకొండ : ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలను ప్రకటించి.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వాటిని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విసుగు వచ్చిందని ఆయన అన్నారు. హామీలు నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 420 హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిందని వినయ్ భాస్కర్ గుర్తుచేశారు. 1000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతోపాటు చెప్పని అనేక పథకాలను కూడా అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజల పక్షాన ఇప్పటికే శాంతియుత నిరసనలు, ధర్నాలు చేపట్టామని తెలిపారు. ఇక బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు కాంగ్రెస్ హామీల అమలుపై విస్తృతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
భూ కబ్జాలపై ఆరోపణలు..
హనుమకొండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వెనుక ఉండి అనేక భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వినయ్ భాస్కర్ ఆరోపించారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వెనుక ఉండి అనేక భూ కబ్జాలు జరిపిస్తున్నారని విమర్శించారు. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు తనకు సంస్కారం ఉందని, అందుకే తాను బూతులు మాట్లాడటం లేదన్నారు. కాజీపేట వైఎస్సార్ నగర్‌లో గుడిసెలను తొలగించడం అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. మైనారిటీల షాదీఖానా నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కూడా తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు వచ్చిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద తనకు పలుకుబడి ఉందని చెబుతున్నారని, నిజంగా ఉంటే జీవో నంబర్ 97ను రద్దు చేయించాలని సవాల్ విసిరారు. కాజీపేట వైఎస్సార్ నగర్‌లో గుడిసెలు లేకుండా చేయడమే అభివృద్ధా? అని వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేయించారని వినయ్ భాస్కర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి దగ్గర ఉన్నానని చెబుతున్నావు కదా.. అయితే జీవో నంబర్ 97ను రద్దు చేయించు అంటూ సవాల్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బాకీ కార్డులతో నిరసనలు : చల్లా ధర్మారెడ్డి
తాము ఇచ్చిన బాకీ కార్డులతో పరకాల నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. కేసీఆర్ జూలై 7వ తేదీలోపు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నది తామా? మీరా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నాయకులను చూసి కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏవి అమలు చేశారో చెప్పాలని ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేయని హామీలను అడగడం ప్రతిపక్ష నాయకుల బాధ్యత అన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని ఆపాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. పరకాల ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి : నన్నపనేని నరేందర్
కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పాలనను పక్కనపెట్టి పంచాయతీలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ విమర్శించారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలను తగ్గించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ను రాజీనామా చేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఢిల్లీకి పలుమార్లు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.

