రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్.. బీజేపీ కక్షనే
కాషాయం పార్టీ రాజకీయ వైఖరికి నిదర్శనం
ఈరోజు రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్.. రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసు
హల్ద్వానీలో దళితులను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూర్చున్న ప్రదేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు గంగాజలంతో శుద్ధి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. దళితుడు కూర్చున్న ప్రదేశాన్ని శుద్ధి చేయడం దళితులను అవమానించడమేనని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం గాంధీభవన్ నుంచి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టినట్లు స్వర్ణ తెలిపారు. ర్యాలీగా వెళ్తున్న మహిళా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్ ఎదుటే శాంతియుత నిరసన చేపట్టామని చెప్పారు.
కాషాయం పార్టీ రాజకీయ వైఖరికి నిదర్శనం
హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ అనంతరం ఆయన కూర్చున్న ప్రదేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు గంగాజలంతో శుద్ధి చేశారని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. ఒక దళితుడు కూర్చుంటే ఆ ప్రదేశం అపవిత్రమవుతుందా? అని ప్రశ్నించారు. ఇదేనా బీజేపీ హిందుత్వం.. ఇదేనా ఆ పార్టీ సంస్కారం అని నిలదీశారు. ఖర్గేను అవమానించడం మాత్రమే కాదని, భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించడమేనని అన్నారు. ఈ ఘటనను తమ నాయకుడు రాహుల్‌గాంధీ ధైర్యంగా ప్రశ్నించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని తెలిపారు. అయితే నిందితులపై చర్యలు తీసుకోకుండా న్యాయం కోసం మాట్లాడిన రాహుల్‌గాంధీపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఏ విధమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసు
కులగణన జరగాలని రాహుల్‌గాంధీ అడిగితే కేసు, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరితే కేసు, దేశ సంపదను దోచుకుంటున్న అదానీ గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. దేశ రాజ్యాంగం, ప్రజల ఆత్మగౌరవం కోసం రాహుల్‌గాంధీ భయపడకుండా నిలబడుతున్నందుకే బీజేపీకి ఆయన అంటే భయమని అన్నారు. ఈరోజు రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే.. రేపు ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై ఎఫ్‌ఐఆర్ నమోదవుతుందని హెచ్చరించారు. ప్రజలు భయపడాలని బీజేపీ భావిస్తోందని, అయితే మహిళా కాంగ్రెస్ భయపడబోదని స్పష్టం చేశారు. తాము ఇందిరాగాంధీ వారసులమని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు.
హల్ద్వానీలో దళితులను అవమానించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
రాహుల్‌గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. అదే సమయంలో హల్ద్వానీలో శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన ఇక్కడితో ఆగదని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన “డరో మత్.. భయపడకు” అనే పిలుపుతో ముందుకు సాగుతామని చెప్పారు. రాజ్యాంగం కోసం, దళితుల హక్కుల కోసం, మహిళల ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతామని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

