కొత్తగా చేర్చలేదు.. గతంలో ఉన్నవే!
22ఏ జాబితాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
ప్రభుత్వ భూములు కబ్జా కాకుండానే నిషేధిత చట్టం
పొరపాటున చేరిన భూములను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాం
ధరణిలో 80 మాడ్యూల్స్.. భూభారతిలో 5కే పరిమితం
ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే
అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : నిషేధిత భూముల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరమూ చేర్చలేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. 22ఏ జాబితాలో ఉన్న భూములన్నీ గతంలోనే ఉన్నవని, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే జాబితాను కాపీ చేసి అప్లోడ్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ భూములను బలమున్నవారు కొల్లగొట్టకుండా కాపాడేందుకే నిషేధిత భూముల చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పారు. 22ఏ నిషేధిత భూములపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వ భూములను బలవంతులు ఆక్రమించకుండా కాపాడటమే 22ఏ నిషేధిత జాబితా ప్రధాన ఉద్దేశమని పొంగులేటి తెలిపారు. 1995లో ఘట్కేసర్ రైల్వేస్టేషన్ భూమిని కూడా ఒకరికి రిజిస్ట్రేషన్ చేశారని గుర్తుచేశారు. ఇలాంటి అక్రమాలు మళ్లీ జరగకుండా నిషేధిత భూముల జాబితాను తీసుకువచ్చారని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2016లో జీవో 121 తీసుకువచ్చారని, ఆ జీవో ద్వారా అనేక మంది రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కొత్తగా నిషేధిత జాబితాలో ఒక్క ఎకరమూ చేర్చలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆస్తుల పరిరక్షణే రెవెన్యూ సంస్కరణల లక్ష్యమని తెలిపారు.
ప్రభుత్వమే విక్రయించిన భూములూ 22ఏలో
నిషేధిత జాబితాలో ఉండకూడని కొన్ని భూములు మొదటి నుంచే అందులో ఉన్నాయని పొంగులేటి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో జారీ చేసిన జీవోల ఆధారంగా ఆ జాబితా రూపొందిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే కాపీని అప్లోడ్ చేసిందని, అధికారులు దానిని ప్రింట్ తీసి మరోసారి అప్లోడ్ చేయడంతో పొరపాట్లు జరిగాయని చెప్పారు. గతంలో ప్రభుత్వం విక్రయించిన భూములు, ప్లాట్లుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఇచ్చిన భూములు కూడా పొరపాటున 22ఏ జాబితాలో చేరాయని తెలిపారు. అధికారులు చేసిన పొరపాట్లను యుద్ధప్రాతిపదికన సరిదిద్దుతున్నామని చెప్పారు. గతంలోనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఇచ్చిన జీవోను ఎవరైనా చూపిస్తే వెంటనే భూమిని జాబితా నుంచి తొలగిస్తున్నామని స్పష్టం చేశారు.
ధరణిలో 80 మాడ్యూల్స్‌తో ఇబ్బందులు
ఒక్కరోజులోనే మ్యుటేషన్ చేసే విధానం వల్ల గతంలో ఎన్నో అక్రమాలు జరిగాయని మంత్రి అన్నారు. ధరణి పోర్టల్‌లో 80 మాడ్యూల్స్ పెట్టి పేద రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఇప్పుడు భూభారతి చట్టంలో 80 మాడ్యూల్స్‌కు బదులుగా కేవలం 5 మాడ్యూల్స్ మాత్రమే ఉంచామని వివరించారు. దొరల పాలనలో పాసుపుస్తకాలు ఉండేవి కానీ భూములు మాత్రం ఉండేవి కావని పొంగులేటి విమర్శించారు. ధరణి చట్టం తీసుకువచ్చి బంధువులు, రాజకీయ అనుచరులకు పాసుపుస్తకాలు ఇచ్చారని ఆరోపించారు. భూములు లేకపోయినా కొందరికి పాసుపుస్తకాలు ఇచ్చి కోట్ల రూపాయల రైతుబంధు నిధులు చెల్లించారని, భూమిలేని వారికి రైతుబంధు ఇచ్చి వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మాక్ అసెంబ్లీ నిర్వహించడం ఎందుకని మంత్రి ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా బయట మాక్ అసెంబ్లీ పెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
రైతుల వివరాలు విదేశీ సంస్థ చేతిలో
కోట్లాది మంది రైతుల వివరాలను విదేశీ సంస్థ అయిన టెరాసిస్ చేతిలో పెట్టారని పొంగులేటి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెరాసిస్ సంస్థను తొలగించి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని 387 గ్రామాలకు నక్షలు లేవని చెప్పారు. దాదాపు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని గ్రామాల్లో సమగ్ర భూసర్వే చేపట్టామని వివరించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇప్పటికే భూముల సర్వే పూర్తి చేసి రైతులకు పాసుపుస్తకాలు అందజేశామని తెలిపారు.వచ్చే ఏడాదిన్నరలోపు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వేను పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భూముల హద్దులు, యాజమాన్య హక్కులు, రెవెన్యూ రికార్డుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ధరణి పేరుతో వేలాది ఎకరాలు చెరబట్టారు
ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని గత పాలకులు అర్ధరాత్రి వేళ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని పొంగులేటి ఆరోపించారు. రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాలను తమ సొంత ఆస్తిలా భావించారని విమర్శించారు. ధరణి పోర్టల్‌లో తప్పుల నమోదుతో లక్షలాది మంది రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలో జరిగిన తప్పుల కారణంగా వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి అన్నారు. ధరణి పోర్టల్‌కు లాక్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల భూములపై నిఘా పెట్టారని విమర్శించారు. భూభారతి చట్టం ద్వారా ఆ ఇబ్బందులను తొలగించి రైతులకు భూములపై స్పష్టమైన హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యం
నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన భూములను గుర్తించి తొలగించడంతో పాటు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి స్పష్టం చేశారు. భూముల రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. భూసర్వే పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల హద్దులు, హక్కులు, రికార్డుల విషయంలో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు. రైతులు, పేదలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భూభారతి ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

