రక్తదానం ప్రాణదానంతో సమానం
ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని బాధ్యతగా భావించాలి
బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ
కాకతీయ, హనుమకొండ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఒక బాధ్యతగా భావించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ పిలుపునిచ్చారు. హనుమకొండలోని పోచమ్మకుంటలో నిర్వహించిన మహా రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని, రక్తదాతల ద్వారా మాత్రమే సేకరించి అవసరమైన వారికి అందించగలమన్నారు.యువత పెద్దసంఖ్యలో రక్తదానానికి ముందుకు రావాలని పేరం గోపికృష్ణ కోరారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా అవసరమైన సమయంలో మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. రక్తదానంపై యువతలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వాయుపుత్ర గజానన మండలి ప్రతినిధులు, రెడ్‌క్రాస్ సిబ్బంది, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

